మాన్సాస్ లో డ్యూటీ మొదలుపెట్టేసిన సంచైత.. తొలి నిర్ణయమే వివాదాస్పదం...

సంచలన రీతిలో విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు బాధ్యతలను చేపట్టిన సంచైత గజపతిరాజు తన తొలి నిర్ణయంతో మరో సంచలనం రేపారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు ఆమె ఇచ్చిన అనుమతులతో అక్కడికి వెళ్లిన అధికారులను స్ధానిక రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.


సంచైత తొలి ఆర్డర్... విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సంచైత గజపతిరాజు అప్పుడే పని మొదలుపెట్టేశారు. మాన్సాస్ ట్రస్టుకు చెందిన ఆస్తుల పరిరక్షణ చేపడతానని హామీ ఇచ్చిన ఆమె.. తాజాగా తీసుకున్న తొలి నిర్ణయం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సమీపంలో విజయనగరం జిల్లా పూసపాటి రాజవంశీయుల మాన్సాస్ ట్రస్ట్ కు చెందిన సుమారు 300 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో ఇసుక తవ్వకాలకు మాన్సాస్ ట్రస్టు తాజాగా అనుమతి ఇచ్చింది.



ఉపాధి దెబ్బతింటోందని... అయినవిల్లిలోని 300 ఎకరాల మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల తమ ఉపాధి కోల్పోవడంతో పాటు, లంక గ్రామాలు నదీ కోతకు గురవుతాయని రైతులు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు.. అక్కడే దర్నాకు దిగారు. రైతులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో అధికారుల ఆదేశాల మేరకు రంగంలోనికి దిగిన కె.గంగవరం పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత మాన్సాస్ భూముల్లో పోలీసు పహారాలో ఇసుక తవ్వకాలు తిరిగి ప్రారంభమయ్యాయి.


ఇసుక తవ్వకాలపై గతంలోనూ వివాదాలే... మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తాజాగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును తప్పించి సంచైత గజపతి రాజును ప్రభుత్వం నియమించి వారం రోజులు తిరగక ముందే ఇసుక త్రవ్వకాలు ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇసుక త్రవ్వకాలకు ప్రయత్నం చేసినప్పటికీ మాన్సాస్ ట్రస్ట్ తో పాటు స్థానిక రైతులు అభ్యంతరం చెప్పడంతో అప్పట్లో అధికారులు వెనక్కి తగ్గారు. తిరిగి సంచైత బాధ్యతలు చేపట్టాక ఇసుక తవ్వకాలు ప్రారంభం కావడంపై రైతులు మండిపడుతున్నారు.