ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం చేసిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మే 23 నుంచి మే 29 ఉదయం 10 గంటల వరకు ‘సమయం’ ఒపీనియన్ పోల్ నిర్వహించింది.
జగన్ అనే నేను.. అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవాంధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతోంది. 151 సీట్లతో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఘన విజయం సాధించిన జగన్.. 30 ఏళ్లపాటు అధికారంలో ఉండటమే తన లక్ష్యమన్నారు. సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల్లో పోరాడిన ఆయన జనాల హృదయాలను గెలుచుకొని జననేతగా మారారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకున్నానన్న జగన్.. జనం కష్టాలను తీర్చడానికి ‘నవరత్నాలు’ తీసుకొచ్చారు. తన తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. జగన్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి ‘సమయం’ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. జగన్ పాలన ఎలా ఉంది? ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ విశేషాలు మీకోసం..
జగన్ పాలన ఎలా ఉంది?
జగన్ పాలన గురించి తెలుసుకోవడం ‘సమయం’ పాఠకులను పది ప్రశ్నలు అడిగింది. మొదటి ప్రశ్నగా జగన్ ఏడాది పాలన ఎలా ఉందని ప్రశ్నించింది. జగన్ ఏడాది పాలన చాలా బాగుందని 37.13 శాతం మంది అభిప్రాయపడగా.. బాగుందని 12.82 శాతం మంది, ఫర్వాలేదు అని 10.43 శాతం మంది అభిప్రాయపడ్డారు. బాగోలేదని 39.62 శాతం మంది తెలిపారు. ఓవరాల్‌గా చూస్తే.. జగన్ మొదటి ఏడాది పాలన పట్ల 60 శాతానికిపైగా సానుకూలత వ్యక్తమైందని భావించొచ్చు. అదే సమయంలోనూ ఆయన పాలన పట్ల దాదాపు 40 శాతం మందిలో వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం.