మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. అస్వస్థతతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్టుగా సమాచారం. మన్మోహన్ అనారోగ్యానికి కారణం ఏమిటో ఇప్పటి వరకూ ప్రకటన రాలేదు. ఆరోగ్య బాగోలేకపోవడంతో.. అన్ ఈజీగా ఉండటంతో.. మన్మోహన్ ను ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎయిమ్స్ డాక్టర్లు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారని, ఆయన ఇబ్బందికి కారణాన్ని తెలుసుకుంటున్నట్టుగా వారు ప్రకటించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ వయసు 87 సంవత్సరాలు. క్రియాశీల రాజకీయాల్లో అంత యాక్టివ్ లేరాయన. అయితే అడపాదడపా కాంగ్రెస్ పార్టీ మీటింగులకు హాజరవుతూ వస్తున్నారు.
పది సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ కు దేశ ఆర్థిక, రాజకీయ ప్రస్థానంలో చాలా పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ లో ముఖ్య వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన్మోహన్ ను అబ్సర్వేషన్లో ఉంచినట్టుగా వారు ప్రకటించారు.
అదలా ఉంటే.. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కూడా ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. లక్నోలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉదర సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నారని తెలుస్తోంది. ములాయం త్వరగా కోలుకోవాలని బీజేపీ ముఖ్య నేతలు కొందరు ట్వీట్లు పెట్టి ఆకాంక్షిస్తున్నారు.