రేపటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు

తాడేపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నివారించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రజలను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఏపీలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించారు.