కరోనాతో జీవితం అస్తవ్యస్తం.. కాజల్ అగర్వాల్ కంటతడి.. భావోద్వేగం

ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ అన్ని వర్గాల ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిస్తున్నది. తాజాగా కరోనా కాటుకు అస్తవ్యస్తమైన ఓ జీవితాన్ని చూసి సినీ తార కాజల్ అగర్వాల్ ఆవేదనకు గురయ్యారు. చిన్న జీవితాలపై ఇలాంటి అంశాలు ఎంత దారుణంగా ఉంటాయని కంటతడి పెట్టినంత పనిచేసింది. వివరాల్లోకి వెళితే..


క్యాబ్ డ్రైవర్ పరిస్థితి చూసి


కరోనావైరస్ ప్రభావం ప్రజల జీవితాలపై ఎంత ప్రత్యక్షంగా పడిందో అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూశాను. నేను నా క్యాబ్ డ్రైవర్ పరిస్థితి చూసి షాక్ తిన్నాను. గత 48 గంటల్లో ఫస్ట్ కస్టమర్ మీరే అంటూ నాకు చెప్పడంతో నాకు చాలా బాధేసింది. ఈ రోజు కారు నడిపితే వచ్చే ఆదాయం ద్వారా ఇంట్లో వస్తువులు వస్తాయేమోనని నా భార్య ఎదురు చూస్తుంటుంది అని చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి అని కాజల్ వెల్లడించింది.