ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేటి నుంచి మూడో విడత! ఇవాళ్టి నుంచి వచ్చే నెల 10 వరకు మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకులను అందించనుంది. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తారు.

జగన్ సర్కార్ పేదల్ని ఆదుకోవడానికి మరోసారి ముందుకు వచ్చింది. రెండు విడతల ఉచిత రేషన్‌ సరుకులను పంపిణీ చేయగా.. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 10 వరకు మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకులను అందించనుంది. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.48 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుండగా.. మొదటి విడతలో మార్చి 29 నుంచి, రెండో విడతలో ఈ నెల 16 నుంచి సరుకులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.


మరోవైపు రేషన్ పంపిణీ సమయంలో ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంది.. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు. రేషన్ షాపుల దగ్గర రద్దీ లేకుండా.. జనాలు గుంపులుగా నిలబడకుండా రోజుకు 30 మంది లబ్ధిదారుల చొప్పున టైమ్‌స్లాట్‌ విధానంలో టోకెన్లు పంపిణీ చేశారు. అలాగే అన్ని రేషన్‌ షాపులు, అదనపు కౌంటర్ల వద్ద శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు, నీళ్లు అందుబాటులో ఉంచారు. అంతేకాదు రేషన్‌ కార్డులు ఎక్కువ ఉన్న రేషన్‌ షాపులకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఈసారి ఉచిత సరుకులు తీసుకునే లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ తప్పనిసరి చేశారు అధికారులు. రాష్ట్రంలో రేషన్‌ అందకపోయినా, ఇతర ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. బియ్యం కార్డుల కోసం స్పందన కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 94 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. పరిశీలించి అందులో 81,862 మందిని అర్హులుగా తేల్చారు. మూడో విడత సరుకులు తీసుకునేందుకు మొత్తం 1,48,05,878 మందిని అర్హులుగా తేల్చారు.