ఏపీలో కరోనా: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఇప్పటిదాకా ఎవరూ చేయని పని.. లాక్ డౌన్ పొడగింపుపైనా..

కరోనా వైరస్ విజృంభణ మొదలైన చాలా కాలందాకా సేఫ్ గా కనిపించిన ఆంధ్రప్రదేశ్‌లో.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆదివారం కొత్తగా మరో 34 కేసులు నమోదుకావడంతో మొత్తంగా కొవిడ్-19 పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 226కు పెరిగింది. ఏపీలో కరోనా కారణంగా ఇద్దరు చనిపోయారని వార్తలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం ఒక్క మరణాన్నే(విజయవాడ వ్యక్తి) ధృవీకరించింది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా, అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు.


కరోనాపై సమీక్ష.. ఆదివారం నాటికి ఏపీలో 34 కొత్త కేసులు నమోదయ్యాయని, మొత్తంగా సంఖ్య 226కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన కొద్దిసేపటికే.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు చేశారు. ఈ మీటింగ్ లో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నదాధికారులు హాజరయ్యారు. 


దేశంలోనే తొలిసారి.. ఇప్పటిదాకా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో.. కొవిడ్-19 రోగులకు చికిత్స ప్రత్యేక ఆస్పత్రుల్లోనే చికిత్స కొనసాగుతున్నది. ఏపీలోనూ ఆయా జిల్లా కేంద్రాల్లోని పెద్దాసుపత్రుల్లో గల కరోనా వార్డుల్లోనే చికిత్స అందిస్తూవస్తున్నారు. కానీ ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలంటూ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పడకల సౌకర్యం ఉన్న అన్ని ఆస్పత్రుల్లో దేన్నీ వదలకుండా.. అన్ని చోట్లా ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ తరహాలో రాష్ట్రమంతటా కరోనా వార్డుల్ని ఏర్పాటు చేయనుండటం దేశంలో ఇదే మొదటిసారి కావడంతో జగన్ నిర్ణయం చర్చనీయాంశమైంది.