ప్రతిపక్ష నేతగానూ చంద్రబాబు అనర్హుడు....కరోనా సమయంలోనూ నీచ రాజకీయాలా? వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజం

కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ప్రతిపక్ష నేతగా అనర్హుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి కరోనాను కట్టడి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కష్టంలో ఉన్న ఏపీ ప్రజలను వదిలేసి హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబు ఏపీకి ప్రతిపక్ష నేతా? లేక తెలంగాణకా? అని ప్రశ్నించారు. శనివారం విశాఖలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.


21వ వార్డులో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, మలేరియా విభాగం ఇన్‌స్పెక్టర్‌ దేముడులను సత్కరించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ నాయకులు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు చేయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వుడా చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


వలంటీర్లపై దాడి గర్హనీయం
విపత్కర పరిస్థితుల్లో కూడా విధులు నిర్వహిస్తున్న గ్రామ వలంటీర్లపై టీడీపీ నేతలు దాడులకు తెగబడడం గర్హనీయమని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ నేతల ఆగడాలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం మొగలిపురంలో ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ నేత గండి బాబ్జీ అనుచరుల దాడిలో గాయపడిన గ్రామ వలంటీర్‌ సింగంపల్లి రాంబాబును పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని అతనికి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేయాలని అనకాపల్లి డీఎస్పీకి సూచించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మనిషి పుట్టుక, చావు, జబ్బును కూడా రాజకీయం చేయడం అలవాటైపోయిందని  విమర్శించారు.