వారి జీవితాల్లో పెనుమార్పులు, ఇక వలసలకు చెక్.. రూ. 3 వేల కోట్లతో సీఎం జగన్ సంచలన నిర్ణయం


రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారుల వలసలను నివారించడమే లక్ష్యంగా ఈ హార్బర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది.



రాష్ట్రంలో మత్స్యకారుల వలసలను నివారించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సముద్ర ఉత్పత్తులకు మరింత విలువ జోడించడమే లక్ష్యంగా భారీ ఎత్తున మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులెవరూ ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడదన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలో 8 చోట్ల ఈ మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఒకచోట ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం సుమారు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సంబంధిత అధికారులతో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


8 హార్బర్లు.. మూడేళ్లలో పూర్తి



శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తారు. శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్, శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం, అలాగే.. విశాఖ జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కూడా మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తారు. వీటి నిర్మాణాన్ని రెండున్నర నుంచి మూడేళ్లలో పూర్తి చేస్తారు. ఈ 8 చోట్లా చేపల వేటకు చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.



 


టీడీపీ హయాంలో మొక్కుబడిగా: మంత్రి



గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారని.. పైగా, వీటికి కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆరోపించారు. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని సర్కారు మాత్రం మత్స్యకారులకు పెద్దపీట వేసి 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ల్యాండింగ్‌ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో మత్స్యకారుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని.. భవిష్యత్తులో వలసలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తద్వారా రాష్ట్రంలో చేపల వేట పెరగడమే కాకుండా మత్స్యకారులకు ఆదాయం పెరిగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.



 


మత్స్యకారుల జీవితాల్లో మార్పు


గత టీడీపీ హయాంలో గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూర్పు గోదావరి)ల్లో హార్బర్ల నిర్మాణానికి కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం దాదాపు రూ.3,000 కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ కట్టబోతోందని వెల్లడించారు. దీని వల్ల చేపల వేట పెరగడమే కాక, వారికి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడుతుందని పేర్కొంది. ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలను మత్స్యకారులు ఎవరూ మరిచిపోలేరని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. కాగా, మే 6న చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని 1,15,000 కుటుంబాలకు ఇస్తున్నామన్నారు.